Homemain slidesవిగ్రహం...దేవత...మనిషి

విగ్రహం…దేవత…మనిషి

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;

ప్రపంచంలోనే ఎక్కడా జరగనంత వైభవంగా విజయదశమి పండుగ కలకత్తా నగరంలోనే జరుగుతుంది. తెల్లవారితే దుర్గాష్టమి కావటంతో సిటి ఆఫ్ ప్యాలెస్ గా పిలువబడే రాజధాని నగరం కలకత్తా సందడిగా మారటానికి ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. అర్ధరాత్రి పోలీసులు బార్లని, షాపుల్ని బలవంతంగా మూయిస్తున్నారు. బారు షాపులో నుంచి ఒక చేత్తో మందు సీసా, మరో చేత్తో సగం చదివేసినా ఆర్కియాలజీ పుస్తకంతో రోడ్డున పడ్డాడు వేదాంత్. రోడ్డు పైన జనాలు ఎవ్వరూ లేరు. అక్కడక్కడ పువ్వులు కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి. వాటి వల్లన రోడ్డు మొత్తం సువాసన వస్తోంది. వేదాంత్ మెల్లగా అటు వెళ్లి, ఆ పూల దగ్గర కూర్చొని మందు తాగుతూ.. కింద పడి ఉన్న మల్లెపువ్వుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఆఫ్రికా ఖండంలో ఉండే పూల జాతి మొక్క ఈ జాస్మిన్. దానిలో దాదాపుగా 200 రకాల ఉపజాతి పూల మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ మల్లెపువ్వు. ఇప్పుడు అవి కలకత్తా నగరంలోని ఓ రోడ్డు పై ఇలా పడి ఉన్నాయి. అలా అనుకుంటూ అక్కడ ఉన్న పువ్వుల్ని చూస్తున్నాడు. వాటి మధ్యలో ఏదో మెరుస్తూ కనిపిస్తోంది. చేయి పెడితే దుర్గామాత బంగారు విగ్రహం దొరుకుతుంది. ఆశ్చర్యంతో ఒక్క నిమిషం విగ్రహాన్ని కనురెప్ప వేయకుండా అలాగే చూస్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. పెద్దగా నవ్వుతున్నాడు. మందు సిసాని విసిరేశాడు.. అది టప్.. మంటూ పగిలిపోయింది. అయోమయంలో ప్యాంటు జేబులోనుంచి సిగరెట్ తీశాడు. అగ్గిపెట్టె కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు. విగ్రహాన్ని పట్టుకొని పక్కనే ఉన్న ఫుట్ పాత్ మీద పెట్టి కూర్చొని ఏదేదో… ఆలోచిస్తున్నాడు. కొంచెం రిలీఫ్ అవ్వటానికి సిగరెట్ ఉంది కానీ, అగ్గిపెట్టె లేదు అనుకుంటూ… నోట్లో సిగరెట్ పెట్టుకొని దిక్కులు చూస్తున్నాడు. ఇంకా.. ఏం చేయాలో దిక్కుతోచక పక్కన దొరికిన రెండు రాళ్లని గట్టిగా రాపిడి చేస్తూ…కొడుతున్నాడు. చిరాకు పెరిగి, ఇంకా… ఇంకా… గట్టిగా రాళ్లను కొట్టడం మొదలుపెట్టాడు. గట్టిగా శబ్దం వస్తోంది కానీ, నిప్పు మాత్రం పుట్టటంలేదు.

ఫుట్ పాత్ పైన కూర్చున అమ్మాయి వేదాంత్ ని చూస్తూ…నవ్వుతోంది. వేదాంత్, ఆశ్చర్యంతో ఆమెని చూస్తూ...‘‘ అలా నవ్వకండీ, కొన్ని లక్షల సంవత్సరాలకి ముందు మన పూర్వికులు నిప్పుని ఇలాగే కనిపెట్టారు.’’ అంటూ రాళ్లని మళ్లీ గట్టిగా కొడుతున్నాడు. “వేదాంత్, ఇక ఆపు అంటూ అమ్మాయి అగ్గిపెట్టెను ఇచ్చింది”. వేదాంత్ షాక్ గా చూస్తూ.. ‘‘ అగ్గిపెట్టె మీకు ఎక్కడిది. మీకూడా సిగరెట్ తాగే అలవాటు ఉందా ? ’’ అంటూ అగ్గిపెట్టె తీసుకొని వెంటనే సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చుకొని మెల్లగా రిలీఫ్ అవుతూ పొగను వదులు ఆ అమ్మాయిని చూస్తూ.. ‘‘అవును… ఈ టైంలో ఇక్కడ ఇలా తిరుగుతున్నావు, నీకు భయం లేదా ? ’’ అని అంటాడు. ఆమె నవ్వుతూ…‘‘ భయం ఎందుకు? వేదాంత్ ’’ అని అంటుంది. వేదాంత్ షాక్ గా చూస్తూ..‘‘ మీకు తెలియదా, రెండు నెలలకి ముందు ఒక డాక్టర్ చదివే అమ్మాయిని ఇక్కడే రేప్ చేసి చంపేశారు.. అప్పుడే మర్చిపోయారా ఏంటి?. ’’ ఆమె అలాగే చూస్తూ ఉంటుంది. వేదాంత్ సిగరెట్ పొగ పీల్చుతూ…‘‘ నాకైతే చాలా భయం, అందుకే రోజూ మందు తాగుతా, ఇంకా కొన్ని సార్లు ఇదిగో ఇలా సిగరెట్ కూడా తాగుతా.’’ అంటూ సిగరెట్ ను చూపిస్తాడు మళ్ళీ ఆమెతో మాట్లాడుతూ.. ‘‘అయినా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు, నీకు భయం ఎందుకు ఉంటుంది లే?? సరేకానీ నీ పేరు ఏంటి? చెప్పు ’’ అని అడుగుతాడు. ఆమె “విజయ” అని అంటుంది. ఆమె,అతని వైపు చూస్తూ ‘‘ నీ పేరు వేదాంత్ కదా .. ’’, వేదాంత్ షాక్ అవుతాడు. ‘‘ మీకెలా తెలుసు, నా పేరు. ’’ విజయ, అతని చేతిలో ఉన్న ఆర్కియాలజీ పుస్తకాన్ని చూస్తు, అందులో నీ పేరు ఉంది కదా.. అది చూసి చెప్పానంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ అలా మౌనంగా కూర్చొని ఉండిపోతారు.

‘‘ అవును.. వేదాంత్ అది ఆర్కియాలజీ పుస్తకం కదా… అసలు ఆర్కియాలజీ అంటే ఏమిటి ? ’’ వేదాంత్ కొంచెం ఆశ్చర్యంగా, మరికొంచెం ఆనందంగా ఆమెను చూస్తూ… ‘‘ మీరు ఎప్పుడూ వినలేదా పురావస్తు శాస్త్రం అండీ ’’. విజయ, వేదాంత్ మాటలు వింటూ ‘‘ అంటే ఏమిటి?..వేదాంత్’’. ‘‘ఇప్పుడు ఒక పురాతన గుడి ఉందనుకోండి..దానిని నిర్మించిన విధానం. గుడి నిర్మాణానికి వాడిన రాళ్లు, వజ్రాలు, దానిపై ఉన్న లిపి, బొమ్మల ఆధారంగా అది ఏ కాలం నాటిది. అప్పటి ప్రజల సంస్కృతి ఎలా ఉండేది. వారు ఎటువంటి సమాజంలో ఉండే వారు. ఆ గుడి కట్టడానికి గల కారణాలు. అందులోని దేవతలు ఎవరు,ఏంటి అనేక చారిత్రక విషయాల గురించి తెలుసుకోవటమే ఆర్కియాలజి. విజయ, వేదాంత్ వైపు చూసి అయితే ఒకటి చెప్పు… దేవుళ్లు, దేవతలు ఉన్నారంటావా? ’’ వేదాంత్ కొంచెం ఆలోచిస్తూ, ఏం సమాధానం చెప్పాలా అని సంకోచిస్తూ..‘‘ ఏమోనండీ, నేనది చెప్పలేకపోతున్నా’’ అంటూ మౌనంగా కూర్చుంటాడు. వేదాంత్, విజయను చూస్తూ.. ‘‘నా గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీ గురించి చెప్పండి”. విజయ, కొంచెం నవ్వుతూ…‘‘ నీకు, నా గురించి ఏం చెప్పాలో అడుగు’’. వేదాంత్ కూడా కొంచెం నవ్వుతూ…‘‘ ఇంత అందంగా ఉన్నారు, ఎంత మందిని ప్రేమించి ఉంటారు’’. విజయ కొంచెం ఆశ్చర్యంగా వేదాంత్ వైపు చూస్తూ…‘‘నేను అందరిని ప్రేమిస్తా, ఇప్పుడు నాతో మాట్లాడుతున్న నిన్ను కూడా ప్రేమిస్తున్నా.’’ వేదాంత్ షాక్ తో గందరగోళంగా…‘‘ అయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు. భారతదేశంలో ఆడోళ్ళు ఇలా అందరిని ప్రేమించటం తప్పు. భర్త ఒక్కడినే ప్రేమించాలంటారు. మీరు ఏమో అందరిని ప్రేమిస్తా అంటున్నారు. ’’ విజయ నవ్వుతూ.. ‘‘ నువ్వు మత్తులో ఉన్నావు కదా, ఉదయం నీకు మొత్తం అర్థం అవుతుందిలే. అవును నువ్వు రోజూ మందు తాగుతావా? వేదాంత్”.
‘‘ లేదండీ. బాధ, భయం ఉన్నప్పుడే త్రాగుతా’’.
‘‘ నీకు భయం ఎందుకు వేదాంత్ ’’.
‘‘ జీవితంలో సాధించింది, సంపాదించింది కూడా ఏం లేదండీ. అందరూ నన్ను వదిలేశారు”.
‘‘ అయితే నీకు నేను ఉన్నా, నాకు ఎనిమిది మంది అక్కలు ఉన్నారు. వాళ్లందరిని నీకు పరిచయం చేస్తా మాట్లాడతావా? ’’. వేదాంత్ కొంచెం అయోమయంగా చేతికి ఉన్న గడియారం వైపు చూస్తాడు. దాదాపుగా తెలవారుతోంది . ఎదురుగా ఉన్న గుడి నుంచి ఎనిమిది మంది అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చి కూర్చున్నారు. విజయ, ఒక్కొక్కరిని పరిచయం చేస్తోంది. వాళ్ల పేర్లు చెపుతూ…
బాలా త్రిపుర సుందరీ,
గాయత్రి,
మహాలక్ష్మి,
అన్నపూర్ణా దేవి,
లలితా దేవి,
సరస్వతీ,
దుర్గా
మర్ధినీ దేవి”.
అక్కడ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందరు తనని ప్రేమిస్తున్నారంటూ… సూర్య కిరణాలు మెల మెల్లగా భూమిని తాకేందుకు ముందుకు వస్తున్నాయి. ఆలయం గోపురం మీద వేద మంత్రాలు జపిస్తున్నాయి. ‘‘ వేదాంత్, ఇక మేము వెళ్లటానికి సమయం అవుతోంది. ఈ రోజు దసరా కదా, మా ఇంటిని(భారతదేశాన్ని) శుభ్రం చేసుకోవాలి’’ అంటూ అక్కడి నుంచి విజయ వెళ్లిపోతుంది. కొంచెం దూరం వెళ్లిన విజయ, వేదాంత్ వైపు జాలిగా చూస్తూ…‘‘ ఇన్ని రోజులు నువ్వు ఓడిపోయావ్ అన్నావు కదా, ఇప్పటి నుంచి నీ ఇష్టంతో, మనస్ఫుర్తిగా గెలవటానికి ప్రయత్నించు. నీ ముందు నేను ఉన్నా, చెప్పాను కదా, నా పేరు విజయ’’ అంటూ నవ్వుతూ వెళ్లిపోతుంది. ఏమీ అర్థం కానీ అయోమయలో పక్కకి చూస్తే ఆర్కియాలజీ పుస్తకం మీద అమ్మవారి విగ్రహం అలాగే మెరుస్తోంది. మత్తులో కళ్లు తుడుచుకుంటు, విగ్రహం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు వేదాంత్.

మత్తులో వేదాంత్ ఏదో ఒకలా ఇంటికి చేరుకున్నాడు. సూర్యోదయంతో కలకత్తా మహానగరం అంతా విజయదశమి వేడుకల్లో మునిగిపోయింది. తనకు దొరికిన విగ్రహం ముందు పెట్టుకొని వేదాంత్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. 17వ శతాబ్దపు చివరి కాలం నాటి అమూల్యమైన విగ్రహం అది. మ్యూజియం నుంచి ఎవరో దొంగలిస్తే అతనికి ఈ రోజు ఇలా దొరికింది. రెండు చేతులు జోడించి మొక్కుతున్నాడు… రాత్రి తాగిన మైకంలో పడిపోయిన వేదాంత్ ని కాపాడిన విజయమ్మ మళ్లీ, మళ్లీ అతనికి పొరలు,పొరలుగా గుర్తుకొస్తోంది. విగ్రహానికి దండంపెడుతూ కూర్చున్నాడు. “డాక్టరు అమ్మాయిని రేప్ చేసి చంపేసిన ముద్దాయిలకు పడిన ఉరిశిక్ష” అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అది చూస్తూ.. కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆర్కియాలజిస్ట్ వేదాంత్.

ఇట్లు
మీ రచయిత
రామ్ యలగల
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ… బతుకమ్మ

RELATED ARTICLES

Most Popular

Recent Comments