భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: చదువు కోసం, ఉద్యోగం కోసం కన్నవాళ్లను విడిచి.. దూరంగా హాస్టల్‌లో ఉంటున్న వారిని సీక్రెట్ కెమెరాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదిలు, వాష్ రూంల్లో సీసీ కెమెరాలను సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో విద్యార్థినులను చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్ (Hyderabad)లోని మల్లారెడ్డి కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు వెలుగు చూసిన ఘటన బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో సంగారెడ్డి (Sangareddy)లో మరో గర్ల్స్ హాస్టల్ బెడ్ రూమ్‌లో స్పై (Spy camera) కెమెరాలు కలకలం రేపాయి.
కిష్టారెడ్డి పేట పరిధి మైత్రి విల్లాస్‌లోని లేడీస్ హాస్టల్‌లో స్పై కెమెరాను గుర్తించిన విద్యార్థినిలు.. అమీన్ పూర్(Ameenpur) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి విల్లా నంబర్ 75లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌ను నడుపుతున్నాడు. ఆ హాస్టల్‌లో 30 మంది అమ్మాయిలు ఉంటున్నారు. శుక్రవారం విద్యార్థినీలు హాస్టల్‌లో స్పై కెమెరాను గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని చిప్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గర్ల్స్ హాస్టల్‌ల్లో సీక్రెట్ కెమెరాల ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు గుర్తించిన విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంగతి తెలసిందే. ఈ ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సరియస్ అయ్యింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ కళాశాలకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కూడా సీక్రెట్ కెమెరాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.