భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో (Summer Season) ఎండలు తీవ్రమవుతూ.. మండే గాలులతో (Burning Winds) శరీర ఉష్ణోగ్రత ( Body Temperature) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు భయంకరంగా ఉంటే.. మేలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. వేసవి కాలంలో సర్వసాధారణమైన సమస్య వడదెబ్బ. వడదెబ్బ అంటే సాధారణ సమస్యగా భివిస్తారు కానీ ఇది తీవ్రమైన పరిస్థితి. దీనిని వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుంది.
శరీరం ఎక్కువ వేడికి లోనైనప్పుడు ఉష్ణోగ్రత సడెన్‌గా పెరిగి, అలసట, మైకం, ఆందోళన మొదలైన సమస్యలు వస్తాయి. అందుకే, ముందుగానే అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం. వడదెబ్బకు మొదటి ముఖ్య లక్షణం శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరగడం. కొన్నిసార్లు ఇది 104 డిగ్రీ ఫారన్‌హీట్ దాటుతుంది. వైరల్ ఫీవర్ లేనప్పటికీ వేసవిలో జ్వరం రావడం, చెమట రాకుండా పోవడం, చర్మం వేడి, పొడిగా మారడం వంటివి వడదెబ్బకు సంకేతాలు. వడదెబ్బ తీవ్రతతో శరీరంలో నీరసం, గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం వలన మైకం లేదా మూర్ఛ రావచ్చు. శరీరం పూర్తిగా డీహైడ్రేట్ అవుతుంది. ఇది రక్తపోటు తగ్గింపునకు దారి తీస్తుంది, తద్వారా మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది.
ఎండ వేడి నేరుగా మెదడుపై ప్రభావం చూపించడంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వడదెబ్బతో బాధపడుతున్న వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రవర్తనలో అసహజ మార్పులు, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, అనవసరంగా అరవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగి, గుండె స్పందన వేగంగా మారుతుంది. శ్వాస కూడా అసాధారణంగా వేగంగా జరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.
Share This Post