భారత్ సమాచార్, అమరావతి ;
మరో రెండు వారాల్లో వేసవితో పాటుగా విద్యార్థులకు సెలవులు కూడా పూర్తి కానున్నాయి. దీంతో నూతన విద్యా సంవత్సరం ఆరంభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. విద్యార్థులకు విద్యా కానుక కింద ఇచ్చే సామగ్రి తో పాటుగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చేయటానికి కావాల్సిన మెను పై విద్యా శాఖ యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. పోషకాలతో పాటుగా విద్యార్థులకు రచికరమైన ఆహారం అందివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం తాజాగా ప్రముఖ తాజ్ హోటళ్ల చెఫ్ లను సంప్రదించారు.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వంటకాల తయారీ పై తాజ్ హోటళ్ల చెఫ్ లతో ట్రైనింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి పప్పు, వెజ్ కర్రీ, పులిహోరా, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై తాజాగా ట్రైనింగ్ ఇచ్చారు. మొత్తం 44 వేల 190 పాఠశాలల్లో ఒకే రకమైన రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది . ప్రముఖ చెఫ్ ల ట్రైనింగ్ విద్యార్థులకు ఎటువంటి రుచులు అందించనుందో రెండు వారాల్లో తెలియనుంది.