భారత్ సమాచార్.నెట్, నేషనల్: తమిళనాడు (Tamil Nadu)లో త్రిభాషా వివాదం మరింత ముదిరింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో.. హిందీని మూడో భాషాగా తప్పకుండా నేర్చుకోవాలని కేంద్రం చెబుతుండగా.. దానికి తమిళనాడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. తమపై బలవంతంగా హిందీని రుద్దవద్దని, ఎన్ఈపీని తమిళనాడులో అమలు చేయబోమని ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ (Stalin)తేల్చి చెప్పారు. మార్చి 14న ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూపాయి సింబల్‌ను తొలగించి.. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది.
అయితే రూపాయి గుర్తును తొలగించడంపై దేశవ్యాప్తంగా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా తొలగించడానికి ఆ రాష్ట్రానికి హక్కులు లేవని, అలా చేయడానికి తమిళనాడులో ఎమైన ప్రత్యేక కరెన్సీ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ఆ రాష్ట్రం కష్టాల పాలయ్యే అవకాశం ఉందని.. కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది.
ఇక బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగిస్తూ స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇది భారత ఐక్యతను దెబ్బతీసే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడమేనని ఆమె ఆరోపించారు. ఆ గుర్తుతో సమస్య ఉంటే 2010లో కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో డీఎంకే ఎందుకు వ్యతిరేకించలేదని సోషల్ మీడియా వేదికగా నిర్మలా సీతారామన్ నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే ‘₹’ సింబల్‌ను రూపొందించిన ఉదయ్ కుమార్.. డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడే అని పేర్కొన్నారు. ఈ సింబల్‌ను పక్కనబెట్టడం ద్వారా ఓ జాతీయ గుర్తును డీఎంకే తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి క్రియేటివిటీని విస్మరించిందని ఆమె విమర్శించారు. ఓవైపు యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు సొంత కరెన్సీ చిహ్నాని్ని మనం బలహీనపరుస్తున్నామా అని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారని.. అలాంటిది జాతీయ చిహ్నాలను తొలగించడమంటే.. ఆ ప్రమాణానికి విరుద్ధం వ్యవహరించడమే అని వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్.