భారత్ సమాచార్, జాతీయం ;
దేశరాజకీయాల్లో మహోజ్వల అధ్యాయం
రాజకీయాలకు అతీతమైన అభిమానం
దేశప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం
దేశ రాజకీయాల్లో ఆమెది ప్రత్యేక స్థానం
తనదైన శైలిలో పార్లమెంటులో ప్రసంగం
వివరణాత్మకమైన సమాధానం ఆమె సొంతం
ముక్కుసూటితనం ఆమె వ్యక్తిత్వం
ప్రజాసంక్షేమం కోసం పరితపించింది నిరంతరం
దేశం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని మనస్తత్వం
నిరుపేదల కోసం పరితపించింది జీవితాంతం
అందుకే ప్రజా సేవకురాలిగా నిలిచింది ఆదర్శం
అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా
సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా
ఢిల్లీ పీఠంపై ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసి
విదేశాంగ మంత్రిగా దేశ ఔన్నాత్యాన్ని చాటిచెప్పి
తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొంది
దేశప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సుష్మాస్వరాజ్
జయంతి సందర్భంగా భారత్ సమాచార్.నెట్‌లో ప్రత్యేక కథనం.
బీజేపీ అగ్ర నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హర్యానా రాష్ట్రంలోని అంబాలా కంటోన్మెంట్‌లో పుట్టారు. 1977లో హర్యానా ప్రభుత్వంలో ఆమె కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1987లో హర్యానా ప్రభుత్వంలో ఆమె మరోసారి విద్యా, ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారు. 1992 నుంచి 94 మధ్య ఆమె కేటరింగ్ సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా, రాజ్యసభలో ప్రభుత్వ హామీల కమిటీలో సభ్యురాలిగా వ్యవహరించారు. 1996లో
దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె 11 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర సమాచారం ప్రసారాల శాఖ మంత్రిగా ఆమె సేవలందించారు. 1996 నుంచి 98 వరకు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, నావికాదళ ఆధునీకీకరణపై ఏర్పాటైన సబ్ కమిటీ ఛైర్‌పర్స్‌న్‌గా, ప్రివిలేజేస్ కమిటీ సభ్యురాలిగా ఆమె పని చేశారు.
ఢిల్లీ సీఎంగా సుష్మాస్వరాజ్:
అక్టోబరు 13, 1998 నాడు ఆమె ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతానికి(ఎన్.సీ.టీ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవిలో ఆమె డిసెంబరు 3, 1998 వరకు కొనసాగారు. ఆ తర్వాత రాజ్యసభకు ఆమె రెండోసారి ఎన్నికయ్యారు. తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా సెప్టెంబరు 30, 2000 నుంచి జనవరి 29, 2003 వరకు కొనసాగారు. జనవరి 29, 2003 నుంచి మే 22, 2004 వరకు ఆమె కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రిగా పని చేశారు.
రాజ్యసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా సేవలందించారు. సెప్టెంబరు 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో విలువల కమిటీ సభ్యురాలిగా అక్టోబరు 2004 నుంచి 2009 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీలో సభ్యురాలిగా పని చేశారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గం నుంచి స్వరాజ్ 15 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చౌదరీ మునబ్బర్ సలీంపై 48,931 ఓట్ల తేడాతో నెగ్గారు. 2009 డిసెంబరు 21, 2009 న సుష్మా స్వరాజ్ లోక్‌సభలో బీజేపీ పార్లమెంటరీ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు.
2014లో విదిశ నుంచి మరోమారు గెలిచి ఆమె 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మణ్ సింగ్‌పై 4 లక్షల ఓట్ల తేడాతో నెగ్గారు. మే 27, 2014 నుంచి ఫిబ్రవరి 16, 2016 వరకు ఆమె కేంద్ర విదేశీ, ప్రవాస భారతీయ వ్యవహరాల శాఖ మంత్రిగా సేవలందించారు. ఫిబ్రవరి 16, 2016 నాడు ఆమె కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆగస్టు 6వ తేదీ 2019న తుదిశ్వాస విడిచారు.