భారత్ సమాచార్, తెనాలి ;
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ ఓటర్ పై దాడి చేశారని జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు వీడియోను విడుదల చేశాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పోలింగ్ బూత్ లోకి వెళుతుండగా ఓ ఓటర్ ఇందుకు అభ్యంతరం తెలిపారు. క్యూ లైన్ లో రాకుండా నేరుగా ఓటు వేసేందుకు ఎలా వెళతారు అని ప్రశ్నించారు? దీంతో ఆగ్రహించిన
ఎమ్మెల్యే శివకుమార్ ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా ఆ యువకుడు కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు కూడా ఓటర్ పై దాడికి దిగి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ దౌర్జన్యానికి, గుండాగిరికి, అహంకారానికి పరాకాష్ఠ అని టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పేర్కొన్నారు.
కాగా టీడీపీ కార్యకర్తలు మహిళా ఓటర్లను వేధిస్తున్నారన్న సమాచారం రావడంతో అడ్డుకోవడానికి ఎమ్మెల్యే వెళ్లారని, అక్కడ టీడీపీ కార్యకర్తలు శివకుమార్‌ను దూషించడం ఘర్షణకు దారితీసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.