భారత్ సమాచార్.నెట్, శ్రీనగర్: ప్రశాంతంగా ఉన్న కశ్మీర్(Kashmir) మంగళవారం జరిగిన ఉగ్ర దాడి (Terror attack)తో ఒక్కసారిగా ఉల్కిపడింది. భూతల స్వర్గంగా పేరొందిన కశ్మీర్ రక్తసిక్తం అయ్యింది. పర్యాటకుల (Tourists)పై కాల్పులు జరపడంతో జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) సహా దేశం మొత్తం ఉల్కిపడింది. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అమాయక పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ఇది కశ్మీర్ సాంస్కృతిక వారసత్వం, దాని ఆత్మ , లక్షలాది కశ్మీరీల జీవనోపాధిపై ప్రత్యక్ష దాడిగా పర్యాటక రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ప్రతి ఏట కశ్మీర్‌కు కోట్లాది మంది పర్యాటకలు వస్తుంటారు. కశ్మీర్ వాసులకు ఈ పర్యాటకులే ఆదాయ వనరులు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ప్రభావం ఇప్పుడు కశ్మీర్ పర్యాటక రంగంపై ఎఫెక్ట్ చూపుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కశ్మీర్ పర్యాటక రంగాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడి పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలను పంపింది.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం ప్రారంభించారు. తమకు జూన్ వరకు 90 శాతం బుకింగ్‌లు ఖరారయ్యాయని.. కానీ దాడి తర్వాత దాదాపు 80 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి అని శ్రీనగర్‌కు చెందిన ఒక టూర్ ఆపరేటర్ ఇష్ఫాక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్‌ల రద్దు కంటే, ఈ దాడి పర్యాటక రంగంపై చూపే దీర్ఘకాలిక ప్రభావం పైనే ఎక్కువ ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. దాడి తర్వాత, కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులు తమ భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.