July 28, 2025 5:15 pm

Email : bharathsamachar123@gmail.com

BS

PM Modi: ప్రధాని మోదీని కలవాలంటే ఎవరైనా ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందే! 

భారత్ సమాచార్.నెట్: ప్రధాని మోదీ (Pm Modi)ని కలవాలంటే ఇన్ని రోజులు అపాయింట్‌మెంట్ దొరికితే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రధానిని కలవాలంటే ఓ టెస్టు చేయించుకోవాలని పీఎంవో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రధాని కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీని కలవాలంటే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పరీక్ష చేయించుకోకుండా వస్తే ప్రధానిని కలవలేరని పేర్కొంది.

ప్రధాని మోదీని కలిసిన ఉగ్రవాద వ్యతిరేక ప్రతినిధి బృందం కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధానిని కలవడానికి వెళ్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఢిల్లీలోని ఇతర బీజేపీ నాయకులకు కూడా కొవిడ్-19 పరీక్షలు చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 7 వేల మార్కును దాటగా.. వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. వయసు మీద పడుతున్న వారు, అనారోగ్య సమస్యలు కల్గిన వారు జాగ్రత్తగా ఉండాలని వివరిస్తోంది.

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో చనిపోయారు. కరోనాతో ముగ్గురు కేరళలో, ఒకరు మహారాష్ట్రలో, ఇద్దరు కర్ణాటకలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రం కోవిడ్ కేసులతో ఎక్కువగా ప్రభావితం అవుతోంది. ఇప్పటి వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,223 కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర వైదారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈక్రమంలోనే పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Share This Post
error: Content is protected !!