భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్ మహా నగరంలో ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది. బోనాల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కోసం గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు అమ్మవారి చరిత్రను పూజారులు వివరించారు.
అమ్మవారి దర్శనానంతరం గవర్నర్ దంపతులకు అమ్మవారి పటాన్ని ఆలయ అధికారులు బహూకరించారు. అంతకుముందు అమ్మవారి ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పూగవర్నర్ రాక నేపథ్యంలో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇకపోతే జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూలై 1 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరగగా.. ఇప్పుడు వచ్చే ఆదివారం జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పించనున్నారు. ఇక 14న భవిష్యవాణి రంగం కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కలెక్టర్, దేవాదాయ శాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.