భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టులో బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు రేవంత్ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అయితే సిగాచీ కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం సంబవించిందని.. ఈ ప్రమాదంలో ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదని పిటిషన్‌లో బాబురావు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 54 మంది మరణించారని.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిన్ని అరెస్ట్ కూడా చేయలేదన్నారు. బాధితులకు నష్ట పరిహారం కూడా ఇంకా చెల్లించలేదని.. పటిషనర్ తరఫు న్యాయవాదది కోర్టుకు తెలిపారు.
అలాగే పేలుడు ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని.. ఈ కేసును సిట్‌తో దర్యాప్తు చేయించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా గత నెల 30న పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఈ పేలుడు చోటుచేసుకుంది.