భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒవైపు విద్యార్థులు ఆందోళన (Students Protest) చేస్తున్న వేళా రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ఆ భూముల (Land)కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి (Gachibowli) లోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇందులో యూనివర్సిటీకి చెందిన భూమి లేదని తేల్చి చెప్పింది.
ఆ భూమికి తామే యజమానులమని కోర్టు ద్వారా నిరూపించుకున్నామని ప్రభుత్వం తెలిపింది. 21 సంవత్సరాల క్రితం అంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా తిరిగి సాధించుకుంది. అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో ఎలాంటి చెరువులు లేవని.. సర్వే ప్రకారం, అక్కడి ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కాదని తేలినట్లు ప్రభుత్వం తెలిపింది. నూతనంగా అమలు చేయనున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల భౌగోళిక నిర్మాణాన్ని ఏమాత్రం దెబ్బతీయవని పేర్కొంది.
మరోవైపు ఈ భూమిని వేలం వేస్తుండడంతో.. విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఇకపోతే హెచ్‌సీయూని ఆనుకొని ఉన్న స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ స్థలాన్ని వేలం వేసేందుకు ప్రతిపాదనలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకు దిగింది. కాగా ఈ వ్యవహారంపై పొలిటికల్ రగడ కూడా కొనసాగుతోంది.