భారత్ సమాచార్, విజయవాడ ;
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సాంకేతిక పాలిటెక్నక్ కళాశాలలలో తాజాగా జాబ్ ఎచీవర్స్ డే ను నిర్వహించారు. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాంకతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యంపై పరిశ్రమల విశ్వాసాన్ని ప్రతిబింబించేలా క్యాంపస్ ప్లేస్ మెంట్ లు ఉన్నాయని అన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్ధికి ఉద్యోగం కల్పించటమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారిలో 12,000 మంది విద్యార్ధులు వివిధ ప్రముఖ సంస్ధలలో క్యాంపస్ ప్లేస్ మెంట్లు సాధించారన్నారు. పాలిటెక్నిక్ విద్యార్దులు అంది వచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయవచ్చని, అందుకు అయా సంస్ధలే అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి విభాగం ఈ విషయంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిందన్నారు. వివిధ సంస్ధలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ విద్యార్దులు అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళిక అమలు చేసామన్నారు. టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, థాట్‌వర్క్స్, మెఘా ఇంజనీరింగ్, జిఇ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, అర్సరల్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్, ఎఫ్‌ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, షాపూర్జీ పల్లంజీ, అల్ఫాజ్ లఫల్‌స్కీ, త్రావల్‌కి, త్రావల్ ప్రాజెక్ట్, రాయల్ ఎన్‌ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్‌ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థలలో ఉపాధి చూపామని నాగరాణి స్పష్టంచేసారు.
క్యాంపస్ ప్లేస్ మెంట్ ల ద్వారా నియామకమైన విద్యార్ధుల జీత భత్యాలు కూడా గణనీయంగా ఉన్నాయని, అనేక మంది విద్యార్థులు 8 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌లను అందుకున్నారని, సగటు జీతం ప్యాకేజీ కూడా 3 లక్షలు ఉందని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు అద్భుతమైన ప్లేస్‌మెంట్ అవకాశాలను అందించడానికి సాంకతిక విద్యా శాఖ కట్టుబడి ఉందన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ డిమాండ్‌లను తీర్చేలా వారిని సన్నద్దం చేస్తున్నామని కమీషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంకతిక విద్యా శాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఎంఎవి రామకృష్ణ, లోకేష్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయసారధి, కళాశాల టిపిఓ డాక్టర్ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆంధ్రా పాలిటెక్నక్ లో జరిగిన కార్యక్రమంలో సాంకతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు పాల్గొన్నారు.