భారత్ సమాచార్.నెట్, మధ్యప్రదేశ్: ఓ తాగుబోతు తండ్రి.. తన 11 ఏళ్ల కొడుకు కళ్ల ముందే తల్లిని గొడ్డలితో నరికి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది. శివపురి జిల్లాలోని పిచ్చోర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాయాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాజ్ గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను తీవ్రంగా కొట్టి, గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఇదంతా వారి 11 ఏళ్ల కొడుకు కళ్ళ ముందే జరిగింది. అంతే కాదు, తన భార్యను గొడ్డలితో చంపిన తర్వాత, భర్త రాత్రంతా ఆమె మృతదేహం దగ్గర పడుకుని తర్వాత పారిపోయాడు. తెల్లారిన తర్వాత.. ఆ 11 ఏళ్ల కుమారుడు చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా, వారు షాక్ అయ్యారు.
నిలదీసినందుకే గొడ్డలితో నరికి చంపాడు:
శివరాజ్ గ్రామంలోని కేసర్ బాయి, హరిరామ్ భార్యాభర్తలు. కేసర్ బాయి(43)ని హరిరామ్ గొడ్డలితో దాడి చేసి కొడుకు ముందే భార్యను చంపాడు. హరిరామ్ రాత్రంతా తన భార్య మృతదేహం దగ్గర పడుకున్నాడు. దీన్నంతటిని చూస్తూనే ఉన్న అమాయకుడైన కొడుకు రాత్రంతా భయంతో వణుకుతూ కూర్చొని అక్కడే ఉండిపోయాడు. హరిరామ్ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడని, అతని ఇంటి నుండి ప్రతిరోజూ గొడవలు వచ్చేవని స్థానికులు తెలిపారు. హరిరామ్ తాగి ఇంటికి రావడంతో భార్య నిలదీసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ మరింత పెరిగి హరిరామ్ తన భార్యపై గొడ్డలితో దాడి చేశాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.