భారత్ సమాచార్, దిల్లీ ;
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పై వైసీపీ పార్టీ అధికారిక ట్వీట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. అలవికాని హామీలు ప్రకటించి అధికారాన్ని దక్కించుకొని..ఇప్పుడు హామీల అమలుపై చేతులు ఎత్తేస్తోందని ఆరోపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెడుతోందని రాసుకొచ్చింది.
‘‘అయినా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అడగాల్సింది ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, విశాఖపట్నానికి రైల్వేజోన్, వెనకబడ్డ జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, విభజన సమస్యలకోసం పరిష్కారం. మీ ఎంపీల బలంతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితుల్లో వీటిని సాధించుకొని రావాల్సింది పోయి ఇంతలా దిగజారిపోతారా? మీరు ప్రకటించిన శ్వేతపత్రాల్లోనే మీ డొల్లతనం బయటపడ్డ సంగతి అందరికీ తెలియనిదా? మీ ఆరోపణలకు ఒక్క ఆధారాన్నీ చూపించలేకపోయారు. చివరకు అమరావతి ఎప్పుడు కడతారు అంటే.. మీరే చెప్పాలి అని ఎదురు ప్రశ్న వేస్తారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదంటారు. ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తారా అంటే లేదు అంటారు. పేదలకు భూములపై సర్వహక్కులు కల్పిస్తే అవినీతి అంటారు. ఇంతకన్నా.. దివాళాకోరుతనం ఏముంటుంది.’’ అంటూ ట్వీట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించింది ప్రతిపక్ష వైసీపీ పార్టీ.
సూపర్‌సిక్స్ సహా మేనిఫెస్టోలో ప్రకటించిన ఇతర హామీలు అమలు చేయడానికి ఈ ఏడాదే సుమారుగా రూ.1.67 లక్షల కోట్లు అవసరం అవుతుందని ప్రతిపక్ష పార్టీ చెబుతోంది. ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అమలు చేయలేక అధికారంలోకి వచ్చిన రెండో నెలలోనే ప్రజలకు తెలుగుదేశం పార్టీ పంగనామాలు పెడుతోందని వైసీపీ రాసుకొచ్చింది.