Homeతెలంగాణనిరుద్యోగులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి

నిరుద్యోగులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 7వ తేదీన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మూడు నెలల కింద మూడో స్థానానికే పరిమితం అవుతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారం చేపట్టే స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం నిరుద్యోగులే. పదేండ్లుగా నిరుద్యోగులను అరిగోస పుచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ నోటిఫికేషన్ల వరద పారిచ్చింది. అయితే వాటిని సమర్థంగా నిర్వహించలేక డీలా పడిపోయింది. లక్షలాది నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసింది. చేస్తున్న చిన్న ఉద్యోగాలు మానేసి కొందరు.. అప్పులు చేసి కొందరు..తల్లిదండ్రుల చెమటరక్తంతో కొందరు.. రాత్రింబవళ్లు కష్టపడి చదివినా.. చివరకు ఉద్యోగ పరీక్షలు జరుగక, లీకేజీలతో, వాయిదాలతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నాన్ని నిరుద్యోగులు తీసుకున్నారు. కాంగ్రెస్ పై ప్రేమ లేకున్నా.. తమ ఆకాంక్షలు నెరవేరుస్తుందనే నమ్మకంతో ఆ పార్టీని గెలిపించారు.

కాంగ్రెస్ మంత్రివర్గం కొలువుదీరాక నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని, ఎక్కువ కాలం సాగదీస్తే ఊరుకునే పరిస్థితి లేదని అంటున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, గ్రూప్-1,2ల పై సాహేతుక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రూప్ 1 పై సుప్రీం కోర్టులో కేసు ఉన్నందున.. మంచి లాయర్లను పెట్టి వీలైనంత తొందరగా ఆ సమస్యను కొలిక్కి తేవాలంటున్నారు. సుప్రీం కోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తే ఫిబ్రవరిలోగా ఆ పరీక్షను పెట్టే ప్రయత్నం చేయాలంటున్నారు. ఒకవేళ రద్దు చేయకుంటే ఏప్రిల్ లోగా మెయిన్స్ పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్-2 కూడా జనవరిలో జరుపకుండా మార్చి లేదా ఏప్రిల్ లో నిర్వహించాలని కోరుతున్నారు. వీటి తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచిస్తున్నారు. ఒక వేళ పాత నోటిఫికేషన్లను రద్దు చేయాలని నిర్ణయిస్తే.. మరిన్ని పోస్టులను జత చేసి జూన్, జులైలోగా గ్రూప్ 1,2 పరీక్షలు పూర్తి చేయాలని కోరుతున్నారు.

మరికొన్ని కథనాలు…

బోడి చదువులు.. బానిస బతుకులు

RELATED ARTICLES

Most Popular

Recent Comments