భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యక్షే దైవం తిరుమల (Tirumala) శ్రీవారి (Srivaru) దర్శనానికి వచ్చే భక్తులకు (Devotees) ముఖ్య గమనిక. వేసవి సెలవుల (Summer Holidays) దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. 46 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan) రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం మే 1 నుంచి అమలులోకి రానుంది.
వేసవి సెలవుల్లో శ్రీవారి కొండపై విపరీతమైన రద్దీ ఉంటుంది. వేసవి సెలవుల్లో అంటే రెండు నెలలు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతారు. మే, జూన్ నెలల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. వీఐపీ దర్శనాలు, సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఈ రెండు నెలల్లో ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు అమలులో ఉంటుందని టీటీడీ పేర్కొంది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది.
మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 82,811 మంది భక్తులు దర్శించుకోగా 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.24 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.