భారత్ సమాచార్, అమరావతి ;
భారతదేశం అంతటా మాదకద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో భాగంగా వీటి పై ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మానస్ (మాదక్ పదార్థ్ నిషేధ్ అసూచన కేంద్ర) పేరిట టోల్ ఫ్రీ నంబరు, ఈ మెయిల్, అధికారిక వెబ్సైట్ ను తాజాగా ప్రారంభించింది. మాదకద్రవ్యాల తయారీ, సరఫరా, కొనుగోలు, విక్రయాలు, నిల్వ, స్మగ్లింగ్ తదితర అంశాలపై వీటి ద్వారా ప్రభుత్వానికి పౌరులు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ మాధ్యమాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాల సాగు పై పౌరులు అధికారులకు వివరాలను అందించవచ్చు. డ్రగ్స్ బారి నుంచి బయట పడాలనుకునే బాధితులు కౌన్సెలింగ్, రీహాబిలిటేషన్ కేంద్రాల సమాచారం కూడా ఇక్కడ పొందొచ్చు. ఈ కేంద్రం 24 గంటలూ పనిచేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారులు డ్రగ్స్ బాధితుల వివరాలు చాలా గోప్యంగా ఉంచనున్నట్టు తెలుస్తోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సాగయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా ‘మ్యాప్రోగ్స్’ పేరుతో ప్రత్యేక వెబ్సైట్, యాప్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
పౌరులు ఫిర్యాదు చేసే మార్గాలు:
టోల్ ఫ్రీ నంబర్:1933
మెయిల్ ఐడి: info.ncbmanas@gov.in
అధికారిక వెబ్సైట్: ncbmanas.gov.in
ఉమాంగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.