భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన ట్రంప్.. భారత్ దిగుమతులపై వేసే టారిఫ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దిగుమతులపై 25 శాతం వరకు సుంకం విధిస్తారా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు.
ట్రంప్ స్పందిస్తూ.. భారత్ తమకు మంచి మిత్రదేశమని.. మిగతా ఏ దేశం కూడా విధించని టారిఫ్‌లు అమెరికాపై భారత్ విధిస్తుందన్నారు. ఇతర దేశాలలాగే వారిపై సైతం టారిఫ్ విధిస్తామన్నారు. భారత్‌పై 20 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాల్ని విధించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇకపోతే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు వచ్చే నెల 1 నుంచి పలు దేశాల్లో అమల్లోకి రానున్నాయి. డెడ్ లైన్ దగ్గర పడుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై ఏప్రిల్ 22న ట్రంప్ 26 శాతం టారిఫ్ విధించారు.. తర్వాత కొంతకాలం వరకు వాటిని అమలును నిలిపివేశారు.