భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించే టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నారనే ఆరోపణలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న ఓ అధికారిపై టీటీడీ సస్పెన్షన్ వేటు వేసింది.
టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్న రాజశేఖర్ బాబు చిత్తూరు జిల్లాలోని పుత్తూరుు పరిధిలోని ఓ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఓ భక్తుడు రాజశేఖర్ బాబు చర్చి ప్రార్థనల్లో పాల్గొంటుండగా ఫొటోలు, వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అధికారుల విచారణలో రాజశేఖర్ బాబు నియమాలను ఉల్లఘించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేసింది టీటీడీ.
ఇకపోతే, గత పదేళ్లుగా టీటీడీలో స్వీపర్ స్థాయి నుండి డిప్యూటీ ఈవో స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను టీటీడీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. టీటీడీ ధార్మికతను కాపాడడం, తిరుమల పవిత్రతను పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యమని టీటీడీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏఈఓ సస్పెండ్ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అన్యమతస్థులను టీటీడీ నుంచి వెంటనే తొలగించాలనే డిమాండ్ జోరు అందుకుంది.
Share This Post