భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.. యాదగిరిగుట్ట (Yadagirigutta). ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా నిర్మితమైన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణలో ఏ ఆలయంలో లేని విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పునః నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
అయితే తెలంగాణలోని ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఏపీలోని తీరుమల దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1987 దేవాదాయ చట్టానికి సవరణను రేవంత్ సర్కార్ ఆమోదించింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది. దేవాదాయశాఖ కమిషనర్ నియంత్రణ ఇక ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో దేవాలయం ఉండనుంది.
యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గానికి నోట్ రూపంలో అందించారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని, లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని క్యాబినెట్‌కు సమర్పించిన నోట్‌లో పేర్కొన్నారు. బోర్డుకు చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉండనున్నారు. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. బోర్డు పదవీకాలం మూడేళ్లు ఉండాలని నోట్‌లో ప్రతిపాదించారు. కాగా, వార్షికాదాయం రూ. 100 కోట్లు దాటే ఆలయాలను ఇదే తరహాలో తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇక వేములవాడు దేవస్థానానికి కూడా ఇలాంటి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.