భారత్ సమాచార్, జాతీయం ;
“జై జవాన్ – జై కిసాన్” నినాదానికి ప్రాణం పోసిన ధీరుడు, భారత దేశ స్వతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్రధారుడు, ఇండో-పాకిస్థాన్ యుద్ధ కాలంలో మన దేశాన్ని నడిపించిన రాజనీతిజ్ఞుడు, మొట్ట మొదటి భారత రైల్వే శాఖ మంత్రిగా, హోమ్ మంత్రిగా సమర్థ పాలనను అందించిన దేశ అధ్యక్షులు, అంతటి రాజనీతి గల భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు…
గుజరాత్‌లోని ఆనంద్ యొక్క అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీకి మద్దతు ఇవ్వడం ద్వారా మరియు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్‌ను సృష్టించడం ద్వారా ఆయన పాల ఉత్పత్తి మరియు సరఫరాను పెంచే దిశగా-శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించారు. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శాస్త్రి 1965 లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్పగా నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం.
నిజాయితీకి నిలువుటద్దం…
ఈయన రైల్వే మంత్రిగా కూడా సేవలందించారు. వీరి ఔన్నత్యాన్ని చాటిచెప్పే కథలెన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తప్ప, రైల్వే మంత్రి అన్న విషయం తల్లికి తెలియదు. ఒకరోజు కొడుకును చూడటానికి ఢిల్లీ వెళ్ళేందుకు ఆమె రైలు కోసం స్టేషనులో ఎదురుచూస్తోంది. చివరి రైలు కూడా వెళ్ళిపోయిందని తెలియక రేల్వే స్టేషన లోనే నిరీక్షిస్తోంది. ఇంతలో ఓ రైల్వే ఉద్యోగి ఆమె వద్దకొచ్చి ఇక ఆ రోజు రైళ్ళు లేవని చెప్పి, ఆమె ఎక్కడకు వెళుతుందో తెలుసుకున్నాడు. ఆ వృద్ధురాలి నిస్సహాయస్థితికి జాలిపడి వెయిటింగ్ రూమ్‌లో ఉండమనీ, ఆమె కొడుకు పేరు, ఢిల్లీలో అతడు ఏం చేస్తాడో వాకబు చేశాడు. ఆ తల్లి అతడితో, ‘మా అబ్బాయి రైల్వేలో పని చేస్తాడు కానీ, ఏం పనో తెలియదు. నేను వాణ్ణి లాల్ అని పిలుస్తాను. బయటంతా లాల్ బహదూర్ శాస్త్రి అంటారు’ అంది. ఈ విషయం వెంటనే అక్కడున్న రైల్వే అధికారులకు తెలిసి, ఆగమేగాల మీద అక్కడకు చేరుకొని ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. ఢిల్లీ వెళ్ళిన తరువాత కొడుకుతో, ‘నాయనా! నువ్వు రైల్వేలో ఏం చేస్తావు? అక్కడ వాళ్ళడిగితే నేను చెప్పలేకపోయాను’ అంది అమాయకంగా! ‘ఏదో చిన్న పనమ్మా!’ అని ఆ కొడుకు నిరాడంబరంగా పలికాడు. మీరు రైల్వే మంత్రినని తల్లికి ఎందుకు చెప్పలేదని ఎవరో శాస్త్రిని అడిగితే, ‘ఆమెకు ఆ విషయం తెలిస్తే, ఆపై చుట్టుపక్కల వారందరి కోసం సిఫార్సులు చేయవచ్చు. ఆమె ఏమైనా అడిగితే నేను కాదనలేను. పైగా నా పదవిని చూసి ఆమె గర్వించవచ్చు’ అని సమాధానమిచ్చారు. అంతటి నిజాయితీ తొణికిసలాడే వ్యక్తిత్వం లాల్ బహదూర్ శాస్త్రిది.