భారత్ సమాచార్.నెట్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశంలో రోడ్డు భద్రత కోసం కఠిన ట్రాఫిక్ రూల్స్ అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను రెట్టింపు చేయాలని కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది కేంద్రం.
ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రత.. నిబంధనలను పాటించడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్రైవర్ల ప్రవర్తనను పర్యవేక్షించేందుకు కూడా ఓ ప్రతిపాదన చేసింది కేంద్రం. ‘మెరిట్ అండ్ డీమెరిట్’ పాయింట్ల విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. ఈ విధానం డ్రైవర్ డ్రైవింగ్ చరిత్రను నేరుగా బీమా ప్రీమియంలతో అనుసంధానిస్తుంది. అంటే డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తరచుగా ఉల్లంఘిస్తే.. వారి బీమా ప్రీమియంలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే నిర్దిష్ట సంఖ్యలో డీమెరిట్ పాయింట్లు చేరితే.. డ్రైవర్ల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తారు.
మోటార్ వాహనాల చట్టం సవరణల్లో భాగంగా తెచ్చిన ఈ ప్రతిపాదనపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాన్ని తెలపాలని రోడ్డు రవాణా శాఖ కోరింది. కాగా ఈ నిబంధనలను తమ తమ వాహనాల్లో చిన్నపిల్లలను తీసుకెళ్లే అనేక మంది తల్లిదండ్రులు, స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.