భారత్ సమాచార్.నెట్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ (Chairman) పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ (Ajay Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రీతి సుదన్ (Preeti Sudan) పదవీకాలం ఏప్రిల్ 29తో ముగియడంతో ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ఆ స్థానంలో అజయ్ కుమార్‌ను నియమించింది కేంద్రం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు అజయ్ కుమార్‌ను యూపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన అజయ్ కుమార్ భారత పరిపాలన సేవ (ఐఏఎస్) అధికారి. ఆయన కేరళ క్యాడర్‌కు చెందినవారు. ఆయన 2019 ఆగస్టు 23వ తేదీ నుంచి 2022 అక్టోబర్ 31వ తేదీ వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించే బాధ్యత యూపీఎస్సీకి ఉంటుందన్న సంగతి తెలిసిందే.
యూపీఎస్సీలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ లాంటి కీలక సర్వీసులతో పాటు ఇతర సర్వీసులకు సంబంధించిన పరీక్షల నిర్వహిస్తోంది యూపీఎస్సీ. యూపీఎస్సీలో ఒక చైర్మన్‌తో పాటు మొత్తం పదిమంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతానికి ఈ కమిషన్‌లో రెండు సభ్య పదవులు ఖాళీగా ఉన్నాయి. కాగా యూపీఎస్సీ చైర్మన్ పదవికి గరిష్ఠ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అయితే పదవిలో కొనసాగడానికి వ్యక్తి వయసు 65 ఏళ్లను మించకూడదనే నిబంధన ఉంది.
Share This Post