భారత్ సమాచార్.నెట్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. ఇరాన్‌కు చెందిన 3 ప్రధాన అణుకేంద్రాలపై దాడి చేసింది అమెరికా. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై తాము దాడి చేసినట్లు ప్రకటించారు. మరోవైపు యూఎస్ దళాలు తమ అణుకేంద్రాలపై దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది.
ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి వచ్చిందని అగ్రరాజ్యం అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ఇరాన్ కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని.. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది… ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే అని పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలి ఉన్నాయని.. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ట్రంప్.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా తమకు తోడుగా వచ్చినందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మీ అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందని నెతన్యాహు ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇజ్రాయెల్ ప్రజలతో సహా తన నుంచి ట్రంప్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నెతన్యాహు.
Share This Post