భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. భారత్‌కు అప్పగించవద్దంటూ అతడు చేసిన అత్యవసర పిటిషన్ దాఖలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తహవూర్ అప్పగింతకు అంగీకరం తెలిపిన సంగతి తెలసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత అతడిని భారత్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
చిత్రహింసలకు గురిచేస్తారు
పాకిస్థాన్‌కు చెందిన తనని భారత్‌కి అప్పగిస్తే చిత్రహింసలకు గురిచేస్తారని పిటిషన్‌లో తహవూర్ రాణా ఆరోపించాడు. గుండెపోటు, గాల్ బ్లాడర్ కేన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న తనని భారత్‌కు అప్పగిస్తే.. మరణశిక్ష విధిస్తారని పేర్కొన్నాడు. అంతేకాదు తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐక్యరాజ్యసమితి తీర్పుల ఉల్లంఘనే అని పిటిషన్‌లో తహవూర్ పేర్కొన్నాడు. కాగా నవంబర్ 26 2008లో జరిగిన ఉగ్రదాడుల్లో కీలక నిందితుడిగా తేలిన తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టులో రిటట్ పిషన్ దాఖలు చేయగా అక్కడా చుక్కెదురైంది. ఫలితంగా తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో కూడా తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తామని.. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలో ఇదే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ క్రమంలోనే తనను భారత్‌కు అప్పగించవద్దంటూ మానవతా కోణంలో వెంటనే పిటిషన్‌ను పరిశీలించాలని తహవూర్ రాణా మరోసారి సుప్రీంను ఆశ్రయించగా.. తాజాగా ఆ పిటిషన్‌ను పరిశీలించిన అమెరికా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.