భారత్ సమాచార్.నెట్: సూపర్ హిట్ చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్‌డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ (Actor Vijay Devarakonda).. ఇటీవల వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కింగ్‌డమ్ (Kingdom) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ (Sitara Entertainments) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భాజ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 30న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ హిందీ చిత్ర పరిశ్రమ (Bollywood)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇక్కడి సినిమాలకు ఆదరణ పెరిగిందన్నారు. ఒకప్పుడు ఈ చిత్రాలను పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు ఆ గుర్తింపు కోసం కష్టపడుతోందన్నారు. ఇదంతా కాలచక్రంలాంటిదని, రానున్న రోజుల్లో పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ ప్రస్తుతం క్రియేటివిటీ బాధపడుతోందని.. ఈ లోటును తీర్చేందుకు త్వరలోనే కొత్త దర్శకులు పుట్టుకొస్తారన్నారు.
హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప దర్శకులను ప్రేక్షకులకు అందించనుందని నమ్ముతున్నా అని పేర్కొన్నారు. ముంబై నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చే దర్శకులను బాలీవుడ్ స్వీకరించినప్పుడు.. అక్కడ తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమాలు మొదలవుతాయి అని చెప్పుకొచ్చారు. మంచి ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పిస్తే హిందీ సినిమా పరిశ్రమ మళ్ళీ పురోగతిని సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, కొన్నేళ్లుగా బాలీవుడ్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలను బాలీవుడ్ అందించలేకపోతోంది. బాలీవుడ్ స్టార్లు కూడా పెద్ద హిట్లను సాధించలేకపోతున్నారు. ఇదే సమయంలో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌పై సొంత ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.