భారత్ సమాచార.నెట్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలిపారు. ఆగస్ట్ చివరల్లో పుతిన్ పర్యటన తేదీలను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అజిత్ ధోవల్.. రష్యా భద్రతామండలి సెక్రటరీ సెర్గీ షొయిగుతో సమావేశమైన అనంతరం పుతిన్ పర్యటన విషయాన్ని ప్రకటించారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసలు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే భారత్‌పై మరో 25 శాతం టారిఫ్ విధించారు. ట్రంప్ టారిఫ్‌ల వేళ పుతిన్ పర్యటనకు సంబంధించిన ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, 2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
పుతిన్ భారత్‌కు రాకపోయిన ప్రధాని మోదీని రెండుసార్లు కలుసుకున్నారు. గతేడాది జూలైలో భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను ప్రధాని మోదీకి రష్యా అందించింది. ఇక గతేడాది అక్టోబరు నెలలో కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మరోసారి పుతిన్, మోదీ కలుసుకున్నారు.