భారత్ సమాచార్, సూర్యాపేట : భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గృహలక్ష్మి, డబల్ బెడ్ రూమ్ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి నేడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు తమ తప్పుడు ఆలోచనను మానుకోవాలని పిలుపునిచ్చారు . సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూర్( ఎస్) తాసిల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలందరికీ దళిత బంధు, బీసీ రుణాలు, గృహలక్ష్మిఇండ్లు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లుఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింపజేసే విధానాన్ని మార్చుకొని అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే వారన్నారు. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ లో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు .నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం పర్థం లేని మాటలన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, అందరిని కలుపుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన గులాబీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నితాసిల్దార్ కు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకట్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి అప్పయ్య, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.