భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇక పోల్ మేనేజ్ మెంట్ కు అన్ని రాజకీయ పార్టీలు కూడా రెడీ అయిపోయాయి. మూడో సారి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్, 15 సీట్లు వస్తే చక్రం తిప్పుతామని బీజేపీ భావిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా సవాళ్లు, ప్రతీ సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతీ విమర్శలతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు కాక పుట్టిస్తున్నారు.
స్కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై రకరకాల యాడ్స్ ను అన్ని మీడియాల్లో వేసేసింది. ఆ పార్టీని ఇప్పటికే 11 సార్లు గెలిపించామని, మళ్లీ గెలిపిస్తే అధోగతే అంటూ బీఆర్ఎస్ విరుచుకపడింది. మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు అందించే బీఆర్ఎస్ కావాలా? అంటూ ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, శ్రేణులు ప్రచారం హోరెత్తించారు. మొన్న కర్నాటకలో అమలు చేయలేని హామీలు ఇచ్చి రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలపై దుమ్మెత్తిపోశారు.
దీంతో లాభం లేదనుకున్న కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిరుద్యోగులకు జరిగిన అన్యాయం, ధరణి, డబుల్ బెడ్రూం..వంటి సమస్యలపై ఆ పార్టీ కూడా వినూత్నంగా యాడ్స్ తో ప్రచారం చేయించింది. కాంగ్రెస్ పై నమ్మకం కుదరడానికి కర్నాటక ప్రభుత్వం చేత, అక్కడి సంక్షేమ పథకాలపై తెలంగాణలోని అన్ని ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఈ యాడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నాటక ప్రభుత్వ యాడ్స్ ను నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈసీ.. కర్నాటక ప్రభుత్వానికి 2 4గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ యాడ్స్ కు ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకోవాలని, కానీ అనుమతి లేకుండానే ప్రచురించారు కాబట్టి అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటూ కొంచెం ఘూటుగానే వ్యాఖ్యానించింది. పబ్లిష్ చేయాల్సి వస్తే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరంటూ సూచించింది.