భారత్ సమాాచార్, జాబ్స్ అడ్డా : బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడానికి, కాంగ్రెస్ పార్టీ పీఠం ఎక్కడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అనే విషయం నేడు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ బాగా హాట్ టాపిక్. వీరే కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల గెలుపులో ఆక్సిజన్ లాగా పనిచేశారు. గ్రామాల్లోకి కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. 30 లక్షల నిరుద్యోగులు, వారి కుటుంబాలే కాక వారి కష్టాలను చూసిన సామాన్య జనాలు కాంగ్రెస్ వైపు ఈ ఎన్నికల్లో మొగ్గు చూపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వ తొలి కేబినెట్ లో గ్రూప్స్ పరీక్షలపై చర్చ జరిగినట్టు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించారు. దీనిపై మరింత సుదీర్ఘంగా చర్చించి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు.. ప్రిలిమ్స్ 2.0పై కేసు సుప్రీం కోర్టులో ఉండడంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరిన్ని పోస్టులు కలిపి ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇవ్వాలని, హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తే ఏప్రిల్ లోగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రూప్-2 ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీనిపై కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రూప్-4 ఫలితాల ప్రకటన, భర్తీ విషయంలో కూడా స్పీడ్ పెంచాలని చెప్తున్నారు. కాలయాపన చేస్తే మాత్రం బీఆర్ఎస్ కు పదేండ్లు అవకాశం ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ కు ఐదేళ్లకే పరిమితం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెగి మరో నిరుద్యోగ ఉద్యమం రగిలే అవకాశం ఉందని అంటున్నారు.