భారత్ సమాచార్, జాతీయం ;
నేటి టెక్ యుగంలో మొబైల్ నంబర్ నుంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ వరకు ప్రతిదీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న విషయం తెలిసిందే. భారతీయుల జీవితంలో ఆధార్ అనేది అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు, బ్యాంకు లావాదేవీలు సహా ఏ పని కోసమైన ఇప్పుడు ఆధార్ కార్డు ప్రూప్ గా ఇవ్వాల్సిందే. ఇందులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలుతో పాటుగ బయోమెట్రిక్ వివరాలూ ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆధార్‌ను ఎంతో జాగ్రత్తగా వినియోగించాలి. మీకు తెలియకుండానే కొందరు సైబర్ నేరస్తులు మీ ఆధార్ ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీరు చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లే అవకాశం కూడా రావచ్చు. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మరి ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందా? ఎవరైనా ఎక్కడైనా వినియోగించారా అనేది తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం…
ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ప్రాసెస్
ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకునేందుకు ముందుగా ఉడాయ్ అధికారిక వెబ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. మై ఆధార్ ఆప్షన్ లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఓపెన్ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. (కొత్త పేజీలోకి వెళ్తారు.) అందులో లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. తర్వాత స్క్రీన్ కిందకు స్క్రోల్ చేస్తూ వెళ్తే అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆల్ అని ఎంచుకుని తేదీని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అథెంటికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆరు నెలలుగా మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు కనిపిస్తాయి. అందులో ఎక్కడైనా మీకు తెలియకుండా ఆధార్ ఉపయోగించినట్లు అనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.కాల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు 1947కి కాల్ చేయొచ్చు. లేదా help@uidai.gov.inకి మెయిల్ చేయొచ్చు. లేదా నేరుగా ఉడాయ్ వెబ్‌సైట్లోకి వెళ్లి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. మీ ఆధార్ దుర్వినియోగం అయితే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.