భారత్ సమాచార్.నెట్, అనంతపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన దారుణ ఘటన లేపాక్షి మండలంలో చోటుచేసుకుంది. సడ్లపల్లి పంచాయతీ తిలక్‌నగర్‌లో ఈ నెల 2న వెలుగుచూసిన ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నరేంద్ర తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు షేక్ దిల్షాద్, తన ప్రియుడు పవన్‌తో కలిసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త షేక్ దాదాపీర్‌ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాలిలా.. హిందూపురానికి చెందిన షేక్ దాదాపీర్ భార్య దిల్షాద్, అతని స్నేహితుడు పవన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి దాదాపీర్ వారిని హెచ్చరించడంతో, ఇద్దరూ కలిసి అతడిని చంపాలని పథకం వేశారు. పవన్ తన స్నేహితులతో కలిసి దాదాపీర్‌ను మద్యం తాగేందుకు పిలిచి హత్య చేశారు. శనివారం మలిరెడ్డిపల్లి దర్గా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
మరిన్ని కథనాలు