Homebreaking updates newsఇద్దరూ కలిసి మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ రెడ్డి

ఇద్దరూ కలిసి మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ రెడ్డి

భారత్ సమాచార్, రాజకీయం : బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్నవారు, వాటిలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే పవిత్రులని, ప్రతిపక్షాల్లో ఉన్నవారు ద్రోహులన్న ధోరణితో కాషాయ నాయకుడు మోదీ, గులాబీ అధినేత కేసీఆర్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ ను రాసి విడుదల చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నది ఆ రెండు పార్టీల జాతీయ ఉమ్మడి ప్రణాళిక అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణ తో పాటుగా దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. గడిచిన పదేండ్లలో మోదీ, అమిత్ షాల ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమ చిటుక్కుమన్నది లేదని, దీన్ని బట్టే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న దాడులను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.

గత నెల రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇండ్ల వైపుగానీ, ఆఫీసుల వైపు గానీ ఐటీ, ఈడీ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. కేసీఆర్ కు విరాళాలిచ్చిన వ్యక్తుల జోలికి వెళ్లవని, కాళేశ్వరంలో అవినీతి బట్టబయలైన ఆయన్ను ప్రశ్నించవన్నారు. దశాబ్దాలుగా నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్న వివేక్ ఇండ్లపై ఎన్నికల సమయంలో దాడులు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇంత కాలం బీజేపీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరగానే కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ లేఖలో బహిరంగంగా పేర్కొన్నారు. కక్ష పూరిత రాజకీయాలను తెలంగాణలో స్ఠానం లేదని, ఈ దాడుల పర్వం మొత్తం కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు, విద్యావంతులు, మేధావులు అందరూ గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ అన్యాయమైన ఈడీ దాడులను వ్యతిరేకించాలని మీడియా పరంగా కూడా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments