భారత్ సమాచార్,హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత గత సీఎం చేసినట్టుగా అహంకార పూరిత చర్యలకు పోకుండా సీఎం కూడా సాధారణ వ్యక్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో మొదటిది ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మార్చి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవటం. తన నివాసంగా ప్రగతిభవన్ వద్దు సొంత ఇంటిలోనే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం. అలాగే తన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకూడదు అని పోలీస్ ఉన్నతాధికారులను వారం కిందట ఆదేశించారు.
సీఎం తన ఆలోచనలను నిన్న బుధవారమే అమల్లోకి కూడా తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆయన కాన్వాయ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రయాణించడం సాధారణ ప్రజలకు చాలా విశేషంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణ వాహనాల లాగా ఎలాంటి సైరన్ చేయకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాగిపోవడం.. నిజంగా హైదరాబాద్ వాహనదారులకు ఆనందం కలిగించింది.
ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంస్కరణలు సాధారణ జనాలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆయన తన ప్రమాణ స్వీకారం వేళ..‘‘తాము పాలకులం కాదు.. సేవకులం’’ అన్న మాటలను ఇప్పుడు ఆయన నిజం చేస్తూ అమల్లోకి తీసుకొస్తున్నారు. అసాధారణ వ్యక్తులు చేసే సాధారణ పనులే సగటు జనాల్లోకి వేగంగా వెళ్తాయి. ఇప్పడది స్పష్టంగా అందరికీ అర్థమవుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ ఖుషీ అవుతూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నాయి. రేపటి తరానికి మోడల్ మీరే సీఎం గారూ.. అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.