భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్రంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అధికార పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, పొత్తు చారిత్రాత్మక అవసరం అని, రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవటానికి పొత్తు పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు అర్ధం చేసుకున్న అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు పొత్తుకు వెళ్లారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ పైన ప్రజల్లో ఏవగింపు మొదలైందన్నారు.
వైసీపీకి ఊడిగం చేస్తే ఖబడ్దార్:
వైసీపీ పతనం ఖాయమని, టీడీపీ టికెట్ల కోసం అభ్యర్థులు క్యూ కడుతున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, కానీ ప్రజల డబ్బు తీసుకుని వైసీపీకి ఊడిగం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవని జగన్ కొత్త నాటకం ఆడుతున్నారని, జగన్‌కు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సంక్షేమానికి పేటెంట్ హక్కు టీడీపీదేనని.. సంక్షేమం ఎలా ఇస్తారని వైసీపీ మమ్మల్ని అడుగుతోందని.. జగన్‌కు బుర్ర లేదు…చంద్రబాబుకు బుర్ర ఉందని అన్నారు. తమ నాయకుడు విజన్ ఉన్న నాయకుడని, పెట్టుబడులు తెచ్చే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.