భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: అనారోగ్య సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కథనం ప్రకారం.. కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన ఏపూరి బాలయ్య, రాజ్యం దంపతులకు కుమారుడు నాగరాజు (28), కుమార్తె ఉన్నారు. కుమార్తె తొమ్మిదేళ్ల వయస్సులోనే దీర్ఘకాల వ్యాధితో మృతిచెందింది. వీరు గత 25 ఏళ్లుగా ఊళ్లపాలెంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాగరాజు గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నాగరాజు అనారోగ్యానికి గురై వైద్యం పొందుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో తీవ్ర మనస్తాపం చెంది గ్రామ శివారున ఉన్న వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మరిన్ని కథనాలు