భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి తిరంగా ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కమ్యునిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి చేస్తున్న డ్రామాలని ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీరు మర్యాడీ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే, తాము హిందూ కులవృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు. మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉంటున్నారనే ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతుందన్నారు.
దమ్ముంటే రోహింగ్యాలపై మాట్లాడాలి:
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మార్వాడీలు ఉన్నారని అక్కడ గోబ్యాక్ అంటున్నారా అని ప్రశ్నించారు. మార్వాడీల కారణంగా తెలంగాణ జీడీపీ పెరుగుతోందన్నారు. తెలంగాణలో వారు రాజ్యాధికారం కావాలని కోరుకోవడం లేదని, కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలను తెలంగాణ ప్రజలు స్వాగతించమన్నారు. హైదరాబాద్ పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. దమ్ముంటే రోహింగ్యాలపై మాట్లాడాలని ఆయన అన్నారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరని మండిపడ్డారు. రోహింగ్యాలు గోబ్యాక్ ఆందోళనలు చేస్తామన్నారు.