భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్కడ్ రాజీనామా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ECI) తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపై ఉత్కంఠ నెలకుంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ(NDA) కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మళ్లీ ఎన్డీఏ అభ్యర్థే ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే:
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఉపరాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. బీజేపీలోని అత్యుతన్న నిర్ణయాత్మక విభాగం (బీజేపీ పార్లమెంటరీ బోర్డు) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ నెల 17న (ఆదివారం) సాయంత్రం ఆరు గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చకు తెరలేసింది. ఈ ఎన్నికలో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యం. పార్లమెంటులో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీ(యూ), ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్పీఎఫ్ మరియు ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీయే బలాన్ని 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కు చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు. ఇక లోక్‌సభలో బీజేపీకి 240మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీయే బలం 293 ఉంది. రెండుసభలు కలిసి ఓటు వేసినప్పుడు, విజయానికి అవసరమైన సింపుల్ మెజారీటీని ఎన్డీయే సులభంగా అధిగమిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (I.N.D.I.A)లో కాంగ్రెస్ నుంచి 99లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టమనే చెప్పాలి.
మరిన్ని కథనాలు:
Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ జాబితా సిద్ధం