భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండడంతో ఈ ఏడాది దాదాపు 34,298 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో మొత్తం 1361 సీట్లు మిగిలాయి. ఇక యాజమాన్య కోటా సీట్లు కూడా కలిపితే వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు ఈ ఏడాది రెండు విడతలుగా కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు విడతలు పూర్తయిన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ఏకంగా 31,811 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ 1,126 సీట్లు మిగిలడం గమనార్హం. ఈఏపీసెట్‌లో రాష్ట్రంలో మొత్తం 1,84,248 మంది విద్యార్ధులు అర్హత సాధించగా.. అందులో 1,29,012 మంది కన్వీనర్ కోటాలో చేరేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,28,712 మంది విద్యార్ధులు ప్రవేశాలకు అర్హత సాధించారు. అయితే అన్ని ప్రైవేటు వర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ సీట్లే అధికం.. ఎందుకంటే:
కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ సీట్లు కేటాయించినా.. దాదాపు 25 వేలకు పైగా మిగిలే పరిస్థితి నెలకొంది. కొంత మందికి కోరుకున్న కాలేజీల్లో సీట్లు దక్కకపోవడంతో ఈ సీట్లు కూడా మిగిలిపోయాయి. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 70 శాతం, యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతం, 65 శాతంగా ఉంది. యాజమాన్య కోటా సీట్లలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) మినహా మిగతా అన్ని బ్రాంచిల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. డీమ్డ్ వర్సిటీల్లో వంద శాతం సీట్లను యాజమాన్యమే భర్తీ చేస్తుంది. అయితే ఏఐసీటీఈ డీమ్డ్ టు బీ వర్సిటీలకు కొత్త అనుమతులు ఇస్తుండడంతో చాలామంది వీటిల్లోనూ ప్రవేశాలు పొందుతున్నారు. ఆయా వర్సిటీలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుని ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సీఎస్‌ఈ బ్రాంచికి డిమాండ్ ఉండడంతో ఇప్పుడు అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ సీట్లే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈఏపీసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడానికి బదులు ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీలతోపాటు ఇతర రాష్ట్రాల్లో చేరుతున్నారు.