భారత్ సమాచార్.నెట్: భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను తిరిగి స్వదేశానికి తీసుకురావలని ఆయన కుమార్తె అనితా బోస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు నేతాజీ 80వ వర్ధంతి. 1945 ఆగస్టు 18న జపాన్‌లో చోటు చేసుకున్న ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.
ఈ క్రమంలోనే నేతాజీ కుటుంబ సభ్యులు ఆయన అస్థికలను భారత్‌కు రప్పించాలని మరోసారి కోరాయి. తాజాగా నేతాజీ కూతురు అనిత్ బోస్ ప్‌ఫాఫ్ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ.. ఎప్పటి నుంచో తన తండ్రి అస్థికలను భారత్‌కు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాని చెప్పుకొచ్చారు. టోక్యోలోని రెంకో-జీ ఆలయంలో భద్రపరిచిన అస్థికలు తన తండ్రి నేతాజీవేనని నమ్మకం ఉందని.. వాటికి డీఎన్ఏ టెస్ట్ చేసి అన్ని అనుమానాలకు తెరదించాలని ఆమె కోరారు.
తన తండ్రి మరణంపై ఉన్న అనేక అనుమానాలను తొలగించి శాస్త్రీయ ఆధారాలతో ఒక సమాధానం ఇవ్వాలని.. ఆయన జ్ఞాపకాలను గౌరవించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని అనితా బోస్ రిక్వెస్ట్ చేశారు. తన తండ్రి అస్థికలను ఇండియాకు రప్పించడమే తన చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. కాగా ఆగస్ట్ చివరిలో ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు వెళ్లనున్న క్రమంలో అనిత్ బోస్ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.