భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సోషల్ మీడియాలో తెగ చర్చ జరగుతోంది. మీనా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉపరాష్ట్రపతితో జరిగిన భేటీతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మీడియా కూడా ఈ వార్తలను ప్రాధాన్యంగా ప్రసారం చేస్తోంది. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే ఖుష్బూ బీజేపీలో చేరగా, మరికొందరు సినీ తారలను పార్టీలో చేర్చుకుని బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మీనా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతితో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే మీనా వ్యక్తిగత జీవితానికి వస్తే ఒకప్పుడు తెలుగు.. తమిళంలో అగ్రనటిగా వెలుగొందిన మీనా 2009లో వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో వివాహం చేసుకున్నారు. 2022లో తీవ్ర అనారోగ్యంతో విద్యాసాగర్ కన్నుమూశారు. అప్పటి నుంచి మీనా కుమార్తెతోనే జీవిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీరంగంలో రాణించిన ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టిసారించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Share This Post