భారత్ సమాచార్.నెట్: శాసనసభల్లో ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై.. రాష్ట్రపతితో పాటు పలువురు ప్రశ్నించగా.. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గడువు విధింపుపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
తాజాగా దీనిపై కేంద్రం ప్రభుత్వం స్పందిస్తూ సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వక తన స్పందన తెలిపినట్లు సమాచారం. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం పేర్కొంది. కొన్ని విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల రాజ్యాంగపరంగా గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లులపై గవర్నర్లు అంగీకారం తెలిపే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. వారికి గడువు విధించడం వారి అత్యున్నత స్థానాన్ని తగించినట్లు అవుతుందని తెలిపింది.
వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారా సరిదిద్దాలని సూచించింది. కాగా తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్రాలు పంపే బిల్లులు రాష్ట్రపతి లేదా గవర్నర్ మూడు నెలల్లో ఆ బిల్లులను ఆమోదించడం లేదా తిప్పి పంపించడమో చేయాలని వ్యాఖ్యానించింది.
మరిన్ని కథనాలు:
SupremeCourt: తొలిసారిగా రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు!