భారత్ సమాచార్.నెట్, అల్లూరి సీతారామరాజు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు దాటే క్రమంలో కొందరు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలు రక్షించుకుంటున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా వాగు దాటుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వాగు దాటుతూ ఓ రైతు నీటిలో కొట్టుకుపోయాడు.
పొంగిపొర్లుతున్న వాగులు.. రాకపోకలు బంద్:
అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనాన్ని స్తంభింపజేసింది. పంటపొలాలు నీట మునిగాయి. పాడేరు – జీ.మాడుగుల గ్రామాల మధ్య మత్స్య గెడ్డ వరద ఉధృతి పెరిగింది. హుకుంపేట మండలం చీడిపుట్టు వాగు పొంగిపొర్లడంతో పది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పెదబయలు మండలం పరాధానపుట్టు మత్స్య గెడ్డ పొంగి యాభై గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. అరకులోయ ఏజెన్సీ లోనూ చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైనది.నిత్యావసరల కోసం గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా వాగులు తప్పనిసరి పరిస్థితుల్లో దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. డుంబ్రిగుడ మండలం కించమండ, కితలంగి గ్రామాల మధ్యలో కల కాజ్వేపై పొంగి ప్రవహిస్తుండడంతో దాదాపు 20గ్రామాల ప్రజల రాకపోకలు బంద్ అయ్యాయి.
వద్దని చెప్పినా వినకుండా వెళ్లి.. వాగులో గల్లంతు:
పాడేరు మండలం దిగుమోదాపుట్టులో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వంతెన పైనుంచి పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన రైతు కుమారస్వామి రోజువారీ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు. దిగుమోదాపుట్టు వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాసేపు ఆగాడు. ప్రవాహం తక్కువే ఉందని దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న గిరిజనలు వద్దని వారించినా వినకుండా ముందుకు వెళ్లాడు. రెండు అడుగులు వెళ్లిన తర్వాత వరద ఉధృతికి ఒక్కసారిగా వాగులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కుమారస్వామి గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.