భారత్ సమాచార్.నెట్, చెన్నై: హిందూ దేవుళ్లను అవహేళన చేయడాన్ని సమర్థించలేమని.. లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీయడం సరికాదని అభిప్రాయపడింది మద్రాస్ హైకోర్టు. హిందూ దేవుళ్ళను అగౌరంగా చిత్రీకరించడం.. దుష్ప్రచారాలను చేయడం ద్వారా మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉందని పేర్కొంది. 2022 ఆగస్ట్ 19 శ్రీకృష్ణుడి గురించి సతీష్ కుమార్ అనే వ్యక్తి శ్రీకృష్ణుడిని అవమానిస్తూ ఫెస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు.
గోపికల నుండి వస్త్రాలు దొంగిలిస్తున్న కృష్ణుడి చిత్రంతో పాటు అసభ్యకరమైన శీర్షికలు పెట్టగా.. ఈ పోస్ట్‌పై తూత్తుకుడికి చెందిన పరమశివన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. హిందూ దేవుళ్లను ఈ విధంగా చిత్రీకరించడం ద్వారా మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని.. శాంతి భద్రతల సమస్యలను రేకెత్తించే అవకాశం ఉందని పరమశివన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్టుకు సంబంధించి తుది నివేదికలను ట్రయల్ కోర్టుకు పోలీసులు సమర్పించగా.. సతీష్ కుమార్ వివరాలను పొందలేకపోయామని చెప్పడంతో ఈ కేసును క్లోజ్ చేసింది ట్రయల్ కోర్టు.
ఈ నేపథ్యంలో పరమశివన్ మద్రాస్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును విచారించిన జస్టిస్ మురళీ శంకర్ బెంచ్ పోలీసుల దర్యాప్తు తీరుపై మండిపడింది. ఆరోపణల తీవ్రత ఉన్నప్పటికీ.. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును తిరిగి ప్రారంభించి మూడు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని పోలీసులకు తేల్చి చెప్పంది మద్రాస్ హైకోర్టు.