భారత్ సమాచార్.నెట్, మెదక్: చోరీలు ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూసి ముగ్గురు యువకుడు ఏటీఏంలో చోరీకి యత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో నిందితులు యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.
ట్రాక్టర్‌కు తాడు కట్టి దొంగతనాలు.. చివరికి:
వెల్దుర్తి మండల పరిధిలోని మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్ అనే ముగ్గురు యువకులు గత జూన్ నెలలో గుమ్మడిదల ఎక్స్ రోడ్డులోని HDFC బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి ట్రాక్టర్‌కు తాడు కట్టి దొంగతనం చేయడానికి యత్నించారు. అక్కడ అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ జూన్ 30వ తేదీన వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు గోడను ధ్వసంచేసి లోనికి ప్రవేశించి చోరీకి ప్రయత్నించగా అక్కడ అలాగే అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈనెల మొదటి వారంలో గుమ్మడిదలలోని భవానీ వైన్స్ గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి మద్యం బ్యాటిళ్లను, రూ. 15 వేల నగదును దోచుకెళ్లారు. మళ్ళీ ఈనెల 7న మెదక్ పట్టణంలోని ఆటోనగర్లోని ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్లి లాకర్ గోడను పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అదే రోజు కౌడిపల్లి లోని వైన్స్ షాపుకు రంద్రం చేసి మద్యం బాటిళ్లు దొంగతనం చేశారు. తాజాగా దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
యూట్యూబ్‌లో చూశాకే దొంగతనాలు చేశాం:
ఈ కేసులో ఆ ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిని విచారించారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరు ఈ దొంగతనాలు చేయడానికి యూట్యూబ్ చాలా ఉపయోగపడినట్లు పోలీసుల విచారణలో చెప్పారు. దొంగతనాలు ఎలా చేయాలో యుట్యూబ్‌లో చూశాకే దొంగతనాలు చేసేందుకు యత్నించామని ముగ్గురు దొంగలు చెప్పారు. నిందితుల నుంచి సుత్తి, గడ్డపార, తాడు, సంచులు, బైకులు, ట్రాక్టర్, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.