భారత్ సమాచార్.నెట్, అనంతపురం: అత్తింటి కష్టాలకు మరో గర్భిణీ బలి అయింది. భర్తతోపాటు, అత్తమామలు నిత్యం వరకట్నం తేవాలని వేధించడంతో గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి(23)కి నాలుగేళ్ల క్రితం గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులతో వివాహం అయింది. అత్తింట్లో కాలుపెట్టిన తర్వాత శ్రావణి కాపురం కొంతకాలం సాఫీగానే జరిగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్తతోపాటు, అత్తమామలు నిత్యం మాటలతో చిత్రహింసలు పెట్టారు. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మాట్లాడారు. భర్త, అత్తామామల తీరులో మార్పు రాకపోవడంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయిన ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు:
అత్త, మామ, భర్త వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదురోజుల కింద రూ.1.50 లక్షలతో బంగారు నగలు చేయించి ఇచ్చినా అత్తింటి వేధింపులు తగ్గలేదన్నారు. ఈ విషయమై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. స్థానికంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదును తిరగరాయించుకోవడంతో అత్తింటివారిని ఏం చేయలేకపోయారు. దీంతో ఏ విధంగానూ తన కూతురు శ్రావణికి న్యాయం జరగకపోవడంతో కడుపులో బిడ్డతోపాటు చనిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితులను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు అన్నారు.
మరిన్ని కథనాలు: