August 18, 2025 2:38 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కాంగ్రెస్‌లో బీసీలకు ఓ న్యాయం.. రెడ్డిలకు ఓ న్యాయమా..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది. గతంలో జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత కొండా మురళిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవులు మీకే, పైసలూ మీకేనా అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని మునుగోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్డిలకు ఒక న్యాయం:

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుతుండడంతో మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో చాలా సార్లు రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వినిపించడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ సీనియర్ నాయకులను విమర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ సీనియర్ నాయకులను విమర్శించిన రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డిలను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడంలేదని బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయమా అని నిలదీస్తున్నారు.

మరిన్ని కథనాలు:

Minister Konda Surekha: వివాదస్పదంగా మారిన కొండా సురేఖ వ్యాఖ్యలు

Share This Post