భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వీకెండ్‌తో పాటు వరుసగా వచ్చిన సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే తిరుమలలో రద్దీ ప్రభావం శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లపై పడింది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం ఏర్పడింది.
ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ టికెట్ల జారీ చేస్తోంది. అయితే శనివారం కూడా అదే సమయంలో టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. రద్దీ కారణంగా శుక్రవారం రాత్రి నుంచే శ్రీవాణి టికెట్ల విక్రయాలు ప్రారంభించింది టీటీడీ. ఈ క్రమంలోనే టికెట్ల కోసం ఎగబడటంతో స్వల్ప తోపులాట జరిగింది. కొంతమంది భక్తులు తమకు టికెట్లు దొరకలేదని అన్నమయ్య భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న భక్తులకు టీటీడీ అధికారులు సర్దిచెప్పి వెనెక్కి పంపించారు.
మరోవైపు శ్రీవాణి టికెట్లు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతుండటంపై.. ఆ కోటా టికెట్లను పెంచాలని పలువురు భక్తులు టీటీడీ ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇకపోతే శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 77వేలకు పైగా భక్తులు దర్శించుకోగా.. 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.53 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
మరిన్ని కథనాలు:
Tirumala: వరుస సెలవులు.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు