భారత్ సమాచార్.నెట్, తిరుపతి: ఇటీవల చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మేడం శ్రీనివాసులు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. దర్శనం అయ్యాక లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ దగ్గర నిలబడగా ఒక్కసారిగా శ్రీనివాసులు కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్ కానిస్టేబుల్ గురప్ప తక్షణమే స్పందించి సీపీఆర్ చేసి భక్తుడిని రక్షించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి కి చెందిన 61 ఏళ్ల మేడం శ్రీనివాసులు స్వామివారిని దర్శనం కోసం తిరుమల వచ్చాడు.
కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. సీపీఆర్ చేసి రక్షించి:
ఒక్కసారిగా కింద పడిపోయిన శ్రీనివాసులను అక్కడే విధులు నిర్వహిస్తున్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి గుండెపోటుగా భావించి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలను కాపాడాడు. భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుంచి అంబులెన్స్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి స్విమ్స్‌లో మెరుగైన చికిత్స పొందిన శ్రీనివాసులు ప్రాణాలతో బయట పడ్డాడు. ఎలాంటి సమస్య లేకపోవడంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో కోలుకున్న భక్తుడు శ్రీనివాసులు సొంతూరు వెళ్లిపోగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ గుర్రప్పను భక్తులు, అధికారులు అభినందించారు.